Home POLITICAL ఆ ముగ్గురూ ఇకపైన గవర్నర్లు!

ఆ ముగ్గురూ ఇకపైన గవర్నర్లు!

0

తాజా లోక్ సభ ఎన్నికల్లో వివిధ కారణాలతో పోటీ చేయలేకపోయిన ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ లోక్ సభ స్పీకర్ లు త్వరలో గవర్నర్ లు కాబోతున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొద్దిమంది గవర్నర్లకు ఉద్వాసన పలికి వీరికి ఆ బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు సమాచారం. వారు ఏ రాష్ట్రానికి గవర్నర్లుగా వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. కేంధ్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, ఉమాభారతిలతో పాటు లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ లను త్వరలో గవర్నర్ లుగా చూడబోతారన్నది బీజేపీ వర్గాల సమాచారం.

పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై కన్ను వేసిన బీజేపీ ఈ ముగ్గురినీ అక్కడ నియమించవచ్చని సమాచారం. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నందున అక్కడికి ఉమాభారతిని పంపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సుష్మా స్వరాజ్ ను ఉత్తరప్రదేశ్ కు నియమించవచ్చని సమాచారం. ఇక సుమిత్రా మహాజన్ ను ఎక్కడకు పంపుతారన్నది ఇంకా ఖరారు కాలేదు. తెలంగాణలో బీజేపీ బలపడాలని కోరుకుంటున్నందున ఈ ముగ్గురిలో ఒకరిని పంపే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నరసింహన్ ఇప్పటికి తొమ్మిదేళ్ళుగా అదే స్థానంలో కొనసాగుతున్నారు. విభజన చట్టంలోని పలు అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండడంతో అవి పరిష్కారమయ్యే వరకు రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ను నియమించవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ వేర్వేరు గవర్నర్లయినా సమన్వయంతో నెట్టుకు రావచ్చని మరో వాదన. ఏది జరిగినా ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను త్వరలో తప్పించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల సమయంలో వీరికి టికెట్లు ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిరాకరించినప్పుడే వీరికి గవర్నర్ పదవులు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. అనారోగ్య కారణం రీత్యా సుష్మా స్వరాజ్ పోటీ చేయబోనని పార్టీకి ముందుగానే చెప్పారు. ఉమాభారతి సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరూ పార్టీలో సీనియర్ నేతలే కాక గతంలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది. ఇక సుమిత్రా మహాజన్ దాదాపు ముప్పై ఏళ్ళుగా పార్టీతోనే ఉన్నారు. బీజేపీకి పెద్దగా బలం లేనప్పటి నుంచి ఆమె ఆ పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తూ ఓటమి లేకుండా గెలుస్తూ ఉన్నారు. ఈసారి చివరి అవకాశంగా పోటీ చేయాలని భావించినా 70 ఏళ్ళ వయసు దాటిందనే నిబంధన కారణంగా పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో గవర్నర్ పదవితో సరిపెట్టుకోనున్నారు.