Home POLITICAL ప్రమాణ స్వీకారంలోనూ ప్రజ్ఞా సింగ్ వివాదాస్పదం

ప్రమాణ స్వీకారంలోనూ ప్రజ్ఞా సింగ్ వివాదాస్పదం

0

భోపాల్ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడం మొదలు ప్రమాణ స్వీకారం వరకు సాధ్వి ప్రజ్ఞా సింగ్ వివాదాల్లో ఇరుక్కున్నారు. ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంపై తొలుత వివాదం చెలరేగింది. ఎన్నికల ప్రచారంలో ముంబాయి బాంబు పేలుళ్ళ కేసులో ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరే తన శాపం వల్లనే చనిపోయాడని, మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే దేశభక్తుడని.. ఇలా పలు రకాల ఆరోపణలతో వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు లోక్ సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా తండ్రి పేరుకు బదులుగా స్వామి పూర్ణ చేతనానంత అవదేశానంతగిరి పేరును ప్రస్తావించి వివాదాస్పదులయ్యారు.

ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలుత ఆమె పేరు, ఆ తర్వాత తండ్రి పేరును చదివి ఈశ్వరుని సాక్షిగా లేదా రాజ్యాంగం సాక్షిగా లేదా ఆత్మసాక్షిగా అని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ కాకుండా స్వామి పూర్ణ చేతనానంద అవదేశానంద సాక్షిగా అని ప్రమాణం చేయడంతో పాటు తండ్రి పేరును పేర్కొనలేదు. దీంతో విపక్ష సభ్యులు ఆమె ప్రమాణ స్వీకారానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ జోక్యం చేసుకుని తండ్రి పేరును పేర్కొనాల్సిందిగా కోరారు. సంస్కృతంలో తాను ప్రమాణం చేస్తున్నానని, తన పూర్తి పేరు అదేనని వివరణ ఇచ్చారు.

ఆ వివరణతో సంతృప్తి చెందని సెక్రటరీ జనరల్, ప్రోటెం స్పీకర్ ఈశ్వరుని సాక్షిగా లేదా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేయాల్సిందిగా కోరారు. కానీ కాగితంలో ఉన్నదాన్నే తాను చదువుతున్నానని, తన పూర్తి పేరు కూడా అదేనంటూ మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో ఉన్న వివరాలతో సరిపోల్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆమె తన పేరును ప్రజ్ఞాసింగ్ అని, తండ్రి పేరు సీపీ సింగ్ అని పేర్కొన్నారు. కానీ ఆమె తన ప్రమాణ స్వీకారం సందర్భంగా సాధ్వి అనే పదాన్ని, స్వామి పూర్ణ చేతనానంద, అవదేశానంద అనే పదాలను జోడించారు. ప్రోటెం స్పీకర్ కు, సెక్రటరీ జనరల్ కు తన పూర్తి పేరు అదేనంటూ దబాయించే ప్రయత్నం చేశారు.

లోక్ సభ నిబంధనల ప్రకారమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది తప్ప అందుకు భిన్నంగా చేయరాదని ప్రోటెం స్పీకర్ స్పష్టం చేశారు. విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా, లోక్ సభ ప్రోటెం స్పీకర్ అర్థం చేయించినా, సెక్రటరీ జనరల్ విధానం గురించి వివరించినా ప్రజ్ఞా సింగ్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. చేసేదేమీ లేక ఆమె ఎలా ప్రమాణం చేసినా ఎన్నికల సంఘం డాక్యుమెంట్లలో ఉన్నట్లుగానే లోక్ సభ రికార్డుల్లో నమోదవుతుంది తప్ప అదనంగా ఏదీ చేరదని సభకు స్పష్టం చేశారు.

భారత్ మాతా కీ జైతో ముగింపు
ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు, ముక్తాయింపులకు లోక్ సభ నిబంధనల ప్రకారం తావు లేదు. కానీ ఆమె తన ప్రమాణ స్వీకారంలో తండ్రి పేరును ఉచ్ఛరించకపోవడం, స్వామి పూర్ణ చేతనానంద, అవదేశానంద అనే పదాలను చేర్చడం, చివరకు భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిపోయాయి. నిబంధనలు ఎలా ఉన్నా తనకేం సంబంధం అనే తీరులో ఆమె వ్యవహరించారు. అభ్యంతరకరమైనవాటిని సభ రికార్డుల్లోంచి తొలగిస్తామని ప్రోటెం స్పీకర్, సెక్రటరీ జనరల్ స్పష్టం చేయడంతో భారత్ మాతా కీ జై అనే నినాదాన్ని కూడా తొలగించక తప్పలేదు. నిబంధనలకంటే తాను అనుకున్నదే చెల్లుబాటవుతుందనే ప్రజ్ఞా సింగ్ ధోరణి మున్ముందు ఇంకెన్ని వివాదాలకు దారితీస్తుందో!