Home POLITICAL ఎంపీలకు లోక్ సభ నియమాలు పట్టవా?

ఎంపీలకు లోక్ సభ నియమాలు పట్టవా?

0

చట్టాలను, శాసనాలను, నిబంధనలను రూపొందించే మంత్రులు, ఎంపీలే వాటిని పట్టించుకోకపోతే ఇక వారిని చక్కదిద్దేదెవరు? విధినిర్వహణలో భాగంగా సరిదిద్దాల్సిన అధికారులు సైతం మౌనం వహిస్తే వ్యవస్థను గాడిలో పెట్టేదెవరు? ఇప్పుడు లోక్ సభలో అదే జరుగుతోంది. ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచినవారి చేత సభలో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించే సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంత విచ్చలవిడితనం కనిపించింది. ఒకరు జై శ్రీరాం అంటే… మరొకరు జై భీమ్ అంటారు. ఒకరు జై హింద్ అంటే మరొకరు జై తెలంగాణ అంటారు. ఒకరు వందే మాతరం అంటే.. మరొకరు అల్లాహో అక్బర్ అంటారు.. నిజానికి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇలాంటి నినాదాలు సభా సంప్రదాయాలు, నిబంధనలకు విరుద్ధమైనా వాటిని స్పీకర్ స్థానంలో ఉన్న ప్రోటెం స్పీకర్ పట్టించుకోరు. అలాంటివి నిబంధనలకు విరుద్ధమని చెప్పాల్సిన సెక్రటరీ జనరల్ సైతం ఉదాసీనంగా ఉంటారు. ప్రమాణ స్వీకారం సందర్భంగానే సభ్యులు ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇక మున్ముందు ఈ ధోరణ ఎంతగా ప్రబలుతుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

ఫార్మాట్ కు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం
సభకు ఎన్నికైన సభ్యులు లోక్ సభ నియమావళి లోని 272 (2) నిబంధన (రూల్స్) ప్రకారం నిర్దిష్ట ఫార్మాట్ లోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఆ వాక్యాలకు ముందూ వెనకా కొన్ని పదాలను సభ్యులు జోడించారు. ఇది విరుద్ధమైనదైనప్పటికీ వారించాల్సిన ప్రోటెం స్పీకర్, సెక్రటరీ జనరల్ మౌనం వహించారు. దీంతో సభ్యులు వారి ఇష్టానికి కొత్త పదాలను చేర్చారు. ప్రమాణ స్వీకారం ముగింపులో చాలా మంది భారత్ మాతా కీ జై, జై హింద్, జై తెలంగాణ, వాళ్గ తమిళ్, వళర్గ భారతం, అల్లా హో అక్బర్.. ఇలా ఎవరి ఇష్టానికి తగినట్లుగా వారు పలికారు.

సభలో కనిపించని హుందాతనం
లక్షలాది మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక్కో ఎంపీ లోక్ సభలో ఎంతో హుందాతనంగా వ్యవహరించాల్సి ఉంటుంది. స్పీకర్లు సైతం పలు సందర్భాల్లో సభ్యులకు దీన్ని గుర్తుచేస్తూ ఉంటారు. కానీ ప్రమాణ స్వీకారం సందర్భంగా వెల్లువెత్తిన నినాదాలు ఆ హుందాతనాన్ని మంటగలిపాయి. సభ్యులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న సమయంలో జై శ్రీరాం, భారత్ మాతా కీ జై లాంటి నినాదాలను చూస్తుంటే సినిమాహాళ్ళలో లేదా స్టేడియంలలో యువత కేరింతలు కొట్టిన వాతావరణం కనిపించింది. స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోడీ, మంత్రులు రాజ్ నాధ్ సింగ్ తదితరులంతా బల్లలపై చేతులతో కొడుతూ ప్రవర్తించడం మిగిలిన సభ్యులకు సైతం ఊతమిచ్చినట్లయింది. లోక్ సభా పక్ష నేతగా హుందాగా వ్యవహరించి మిగిలినవారికి ఆదర్శంగా ఉండాల్సిన నేతలే ఇలా ప్రవర్తిస్తే ఇక పరిస్థితి ఏ విధంగా చేయి దాటిపోతూ ఉందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

పేరుకే సబ్ కా విశ్వాస్?
లౌకిక స్ఫూర్తి వెల్లివిరియాల్సిన పార్లమెంటులో మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు వేదికైంది. గడచిన ఐదేళ్ళు సబ్ కే సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పుకున్న బీజేపీ ఈసారి మాత్రం ఆ రెండు పదాలకు సబ్ కా వికాస్ అనే పదాన్ని జోడించింది. అన్ని మతాలను విశ్వాసంలోకి తీసుకుని పరిపాలన సాగిస్తామని గొప్పగా చెప్పుకున్నారు ప్రధాని మోడీ. కానీ వాస్తవంలో మాత్రం ముస్లింలను రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళే సమయంలో ఆయనను రెచ్చగొట్టే తీరులో జై శ్రీరాం, భారత్ మాతా కీ జై నినాదాలతో బీజేపీ సభ్యులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. గత కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన ఆయన సైతం మరింత గట్టిగా నినదించండి అనే తీరులో సైగలతోనే వారికి సంకేతం ఇచ్చారు. బీజేపీ సభ్యులంతా జై శ్రీరాం అని నినదిస్తూ ఉంటే ఒవైసీ మాత్రం జై భీమ్ అనే నినాదాన్ని అందుకున్నారు. సభ్యులంతా ఒవైసీని భారత్ మాతా కీ జై అనే నినాదంతో రెచ్చగొడుతూ ఉంటే ఆయన మాత్రం చివరకు అల్లా హో అక్బర్, జై హింద్ అంటూ ముగించారు.

పథకం ప్రకారం జాతీయవాదాన్ని వ్యాపింపజేస్తున్న బీజేపీ
లోక్ సభ ఎన్నికల్లో పుల్వామా, బాలాకోట్ లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించి సైన్యాన్ని పార్టీ ప్రయోజనం కోసం వాడుకున్న బీజేపీ ఇప్పుడు లోక్ సభ సాక్షిగా ఈ వ్యూహాన్ని అవలంబిస్తోంది. జై శ్రీరాం, భారత్ మాతా కీ జై లాంటి నినాదాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటోంది. అందులో భాగమే బీజేపీ సభ్యులంతా వారి ప్రమాణ స్వీకారం ముగింపులో ఈ నినాదాలను చేశారు. ఈ నినాదాల్లో మంచి చెడులు, స్ఫూర్తి అంశాలు ఎలా ఉన్నా సభలో వ్యవహరించాల్సిన తీరు మాత్రం కాదనేది లోక్ సభ నిబంధనలను చూస్తే అర్థమవుతుంది. ఆ నినాదాలు ఇవ్వడం సమంజసమా కాదా, అందులోని ఔచిత్యం గురించిన చర్చ వేరే అంశం. కానీ సభలో వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా ప్రధాని మొదలు సాధారణ సభ్యుల వరకు వ్యవహరించారనేది మాత్రం నిర్వివాదాంశం.