Home POLITICAL భగీరధుడు సరే… కాళేశ్వరుడెక్కడ?

భగీరధుడు సరే… కాళేశ్వరుడెక్కడ?

0

నీళ్ళు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల కోసం ఏర్పడిన తెలంగాణలో మొదటిదానికి అడుగులు పడ్డాయి. వేగవంతమైన నిర్మాణంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానైన కేసీఆర్ తనకు తాను స్వయంగా అచీవర్ అని చెప్పుకున్నారు. పొరుగు రాష్ట్రాల సహకారం ఉన్నందున మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులనూ ఆహ్వానించారు. నిధులే లేకపోతే ఈ నీళ్ళు సాధ్యమయ్యేది కాదన్న ఉద్దేశంతో రుణం ఇచ్చిన బ్యాంకులు, వివిధ ద్రవ్య సంస్థల ప్రతినిధులనూ ఆహ్వానించారు.

కానీ తినే తిండి, పీల్చే గాలి, పడుకునే నిద్ర అన్నీ కాళేశ్వరమే అని పలువురి చేత ప్రశంసలు అందుకున్న అప్పటి సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మాత్రం ఈ సంతోషంలో, ప్రారంభోత్సవంలో ఎక్కడా కనిపించలేదు. భగీరధుడిగా కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నోచుకున్నా కాళేశ్వరుడనే హరీశ్ రావు మాత్రం తెర వెనకనే ఉండిపోవాల్సి వచ్చింది. స్వయంగా గవర్నర్ నరసింహన్ గతంలో ఈ ప్రాజెక్టు పనులను చూడడానికి వచ్చి హరీశ్ రావు కృషిని ప్రశంసించారు. హరీశ్ రావు అనే పేరును కాళేశ్వరరావు అని కొనియాడారు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరరావు ఎక్కడ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను గవర్నర్ అడగలేరు గదా!

ఒకప్పుడు పార్టీలో నెంబర్ టూ గా, ఆ తర్వాత ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా, ప్రాజెక్టు నిర్మాణం సమయంలో రాష్ట్రానికి మంత్రిగా ఉన్న హరీశ్ రావు ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేగా సిద్దిపేటకే పరిమితమైపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ లభించిన ఆహ్వానం హరీశ్ రావుకు మాత్రం దక్కలేదు. హరీశ్ రావు భాగస్వామ్యం లేకుండా ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలెవ్వరూ ఊహించుకోలేరు. ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ, అటవీ, జల సంఘం అనుమతుల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారు..

కేసీఆర్ లక్ష్యం మేరకు నిర్దిష్ట గడువులో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రేయింబవళ్ళు కష్టపడ్డారు.. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు.. అక్కడే తిన్నారు.. అక్కడే పండుకున్నారు.. కానీ ఆ సంతోషాన్ని గుండెల్లోనే ఉంచుకున్నారు… తన కనుసన్నల్లో జరిగిన పనులను ఒక వర్కర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక మంత్రిగా, కేసీఆర్ కు నమ్మకస్తుడిగా, కార్యసాధనలో సమర్ధుడిగా అనేక పాత్రలు పోషించిన హరీశ్ రావు ఇప్పుడు ఆ మధుర క్షణాలను టీవీల తెరపై మాత్రమే చూసి మురిసిపోయే స్థానానికి పరిమితమయ్యారు.

అతిథులను ఎంపిక చేయడం, ఆహ్వానించడం ముఖ్యమంత్రిగా కేసీఆర్ విచక్షణాధికారం. హరీశ్ రావును ఆహ్వానించడం కూడా ఆయన ఇష్టమే. ఎందుకు పిలవలేదని ఎవ్వరూ అడగేందుకు సాహసించరు. అడిగినా చెప్పాల్సిన అవసరమూ లేదు. వివిధ రూపాల్లో సహకరించినవారందరినీ ఆహ్వానించిన కేసీఆర్ కు హరీశ్ రావు ఎందుకు కనిపించలేదనే అనుమానమే సామాన్య ప్రజానీకానికి, ఆయన అభిమానులకు వస్తోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడాన్ని అలవాటు చేసుకున్న హరీశ్ రావుకు అవమానాలను సైతం ఎదుర్కొనే మనోధైర్యాన్ని అలవాటు చేసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడంతో పాటు దీని నిర్మాత, కర్త, కర్మ, క్రియ, పితామహుడు ఎవరు అని భవిష్యత్ తరాలు ప్రశ్నించుకునేటప్పుడు ఠక్కున కేసీఆర్ పేరే వినిపించాలి. అప్పటి సాగునీటి మంత్రిగా హరీశ్ రావు తనదైన బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన మంత్రి కాదు గదా! కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే. ఏ మంత్రులనూ, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి పిలవలేదు గదా! కేవలం స్థానిక ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆ అవకాశం లభించిందని ప్రభుత్వం లేదా కేసీఆర్ సమర్ధించుకోవచ్చు. ఇప్పుడు సాగునీటిపారుదల శాఖ మంత్రి కూడా కేసీఆరే అయినందున శిలాఫలకంపై కూడా వారి పేర్లే ఉంటాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఎవరు కట్టించారు అని మనం ప్రశ్నించుకుంటే ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూనే చెప్పుకుంటున్నాంగానీ అప్పటి ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తున్నామా? ఇప్పుడూ అంతే ప్రధానిగా మోడీని పిలిస్తే ఆ ప్రమాదమూ ఉంటుందని ఫ్రభుత్వం భావించిందేమో! అందుకే కర్త, కర్మ, క్రియ, ఎచీవర్ అన్నీ తానే అయిన కేసీఆర్ పేరు ఉంటే చాలు! ఈ ప్రాజెక్టులో హరీశ్ రావు పాత్ర ఎంతో ఇప్పటి తరం ప్రజలకు తెలుసు. కానీ భవిష్యత్ తరాల వరకూ చేరే అవకాశం లేదుగదా! అందుకే శిలా ఫలకంపై ఆయన పేరు ఇప్పుడు కనిపించదు! కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణ చరిత్రలో లిఖితంగా లేకున్నా హరీశ్ రావు పేరును మాత్రం ఎవ్వరూ తుడిచేయలేరని, రాళ్లెత్తిన కూలీల లాగానే భవిష్యత్ తరాలు ఆయననూ ఒకడిగా గుర్తించుకుంటారని ఆయన అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.