Home POLITICAL టీఆర్ఎస్ … చెప్పేదొకటి… చేసేది మరొకటి.

టీఆర్ఎస్ … చెప్పేదొకటి… చేసేది మరొకటి.

0

జమిలి ఎన్నికలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లాంటి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా పార్టీలు సమర్ధిస్తున్నాయి. టీఆర్ఎస్ కూడా సమర్ధిస్తోంది. జమిలి ఎన్నికలు మంచివేనని, సమయం కలిసొస్తుందని, ఖర్చు కూడా ఆదా అవుతుందని, ఎన్నికల కోడ్ తో ఎదురయ్యే సమస్యలను నివారించవచ్చునని, అందుకే తమ పార్టీ స్వాగతిస్తోందని గతంలో ఎంపీగా ఉన్న వినోద్ కుమార్, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ టీఆర్ఎస్ వైఖరిని వెల్లడించారు. కానీ ఇది ప్రకటనలకు మాత్రమే వర్తిస్తుందా? ఆచరించడానికి కాదా?

నిజంగా జమిలి ఎన్నికలే మంచివనే అభిప్రాయంతో ఉన్నట్లయితే టీఆర్ఎస్ అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తోంది? లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది జమిలి ఎన్నికల విధానమైనప్పుడు, ఇదే అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉన్నప్పుడు గతేడాది సెప్టెంబరులోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు ఎందుకు వెళ్ళినట్లు? వాస్తవానికి లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశంలో లోక్ సభకు, అసెంబ్లీకి ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నా తెలంగాణలో మాత్రం ఒకేసారి జరిగే సంప్రదాయమే గత ఇరవై ఏళ్ళకు పైగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు దీనికి టీఆర్ఎస్ ఎందుకు బ్రేక్ వేసినట్లు? ఆ స్ఫూర్తితో ఉన్నట్లయితే లోక్ సభతో పాటే ఎన్నికలకు వెళ్ళి ఉండవచ్చుగదా! ఈ రెండు నాల్కల ధోరణి అంతుబట్టదు.

నెలల వ్యవధిలోనే యూ టర్న్

వాస్తవానికి గతేడాది సైతం ఇదే అంశంపై ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చర్చ జరిగినప్పుడు మూడు అంశాల్లో మాత్రమే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసి జమిలి ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమేనంటూ టీఆర్ఎస్ తరఫున ప్రతినిధిగా హాజరైన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. కానీ ఇది జరిగిన కొన్ని నెలలకే టీఆర్ఎస్ అసెంబ్లీ రద్దు చేసింది. ఎన్నికలను వీలైనంత తొందరగా జరిపించాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుంది. జమిలి ఎన్నికలకు సిద్ధమని విధాన నిర్ణయాన్ని ప్రకటించిన నెలల వ్యవధిలోనే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం సమావేశంలో వెల్లడించిన వైఖిరిని విరుద్ధంగా వ్యవహరించింది.

ఎన్నికల నిర్వహణకు భారీ స్థాయిలో ఖర్చవుతోందంటూ మరో కారణాన్ని కూడా చూపించి జమిలి ఎన్నికలే మంచివని వ్యాఖ్యానించింది. కానీ అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా నాలుగైదు నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండు ఎన్నికలు జరగడానికి కారణమైంది. దాదాపు రూ. 700 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. ఖర్చును తగ్గించాలని ఒకవైపు చెప్తూనే దానికి భిన్నంగా వ్యవహరించింది. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికలను విడిగా జరపడం శ్రేయస్కరమని భావించి అసెంబ్లీని రద్దు చేసింది. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధాని అధ్యక్షతన జరిగిన అన్ని పార్టీల సమావేశంలో మాత్రం మళ్ళీ జమిలి ఎన్నికల పాట పాడింది.