Home POLITICAL రేపు కర్నాటకలో కమల వికాసం?

రేపు కర్నాటకలో కమల వికాసం?

0

కర్నాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి గురువారం చివరి రోజు కానుందేమో! అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలు దాదాపుగా కష్టమే. ఆ స్థానంలో తగినంత సంఖ్యా బలంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోసారి ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. కుమారస్వామి సర్కారు దాదాపుగా కూలిపోవడం ఖాయం కావడంతో దేవుడి మీదనే భారం వేసుకున్నారు. శృంగేరీ మఠానికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ తలచిన కార్యం బీజేపీ చొరవతో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సాకారమవుతోంది.

మొత్తం 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో తాజా రాజీనామాల పర్వం అనంతరం అధికార జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి బలం స్పీకర్ తో కలుపుకుని 101కు పడిపోగా, బీజేపీ బలం మాత్రం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో 107కు చేరుకుంది. రాజీనామా చేసిన 17 మందిలో 15 మంది విశ్వాస పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కుమారస్వామి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది. వారు గైర్హాజరైతే సభలో మొత్తం బలం 209కు తగ్గిపోతుంది. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి కనీసంగా 105 మంది సభ్యుల బలం అవసరం. కానీ స్పీకర్ ను మినహాయిస్తే ఆ కూటమి బలం కేవలం 100 మాత్రమే. విశ్వాస పరీక్షలో గెలిచే అవకాశమే లేదు. మరోవైపు బీజేపీ బలం మాత్రం 107కు చేరుకుంది. దీంతో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది.

నొప్పించక… తానొవ్వక.. తరహాలో సుప్రీం ఉత్తర్వులు

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో తలెత్తిన రాజీనామాల సంక్షోభం వారం రోజుల పాటు అనేక మలుపులు తిరిగి విశ్వాస పరీక్ష దాకా వచ్చింది. స్పీకర్ కు రాజీనామాలు సమర్పించినా ఆమోదించలేదంటూ తొలుత పది మంది, ఆ తర్వాత ఐదుగురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అటు స్పీకర్ ను నొప్పించలేక, ఇటు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేసేలా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన పదిహేను మంది ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇచ్చే విప్ కు ఎలాంటి విలువా లేకపోయింది. స్పీకర్ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుందనే విమర్శలకు తావివ్వకుండా సుప్రీంకోర్టు చాలా వ్యూహాత్మకంగానే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా ఆమోదించుకుండా పెండింగ్ లో పెట్టినా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ తగలడం ఖాయమైపోయింది. ఆ రాజీనామాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదు. అదే సమయంలో ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరగడం అనివార్యమవుతోంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఇప్పుడు కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వ పతనానికి కూడా అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయింది మొదలు అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి అసంతృప్తే ఉంది.

కుట్ర ఎవరిదైనా కుమారస్వామికే కష్టాలు

ఎక్కువ సీట్లు ఉన్నా ముఖ్యమంత్రి అవకాశం లభించలేదని మాజీ సీఎం సిద్దరామయ్యకు తొలి నుంచీ అసంతృప్తి ఉంది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామన్న అసంతృప్తి బీజేపీ నేత ఎడ్యూరప్పకూ ఉంది. కాంగ్రెస్ వత్తిళ్ళ నడుమ ప్రశాంతంగా నిద్ర కూడా కరువై ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నట్లు సీఎం కుమారస్వామి అనేక సందర్భాల్లో ఏడుపు ముఖంతోనే మొరపెట్టుకున్నారు. ఒక దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అంతా సిద్ధరామయ్య తెర వెనక ఉండి నడిపిన డ్రామాయే అనే విమర్శలూ వచ్చాయి. తనకు ముఖ్యమంత్రి అవకాశం రాకపోయినా తక్కువ సీట్లతో ఉన్న కుమారస్వామికి మాత్రం ఎందుకు దక్కాలనే అక్కసు సిద్దరామయ్యలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలో గుసగుసలాడుకున్నారు.

మొత్తానికి కర్నాటక సంక్షోభంలో ఎవరి ప్రమేయం ఎంత ఉన్నా అంతిమంగా అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితులు కుమారస్వామికే ఏర్పడ్డాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదంటూ బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కినా ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ అడుగడుగునా ఆ పార్టీ అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు న్యాయస్థానం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు సైతం బీజేపీకే ఎక్కువ అనుకూల పరిస్థితుల్ని కల్పించాయి. అయితే రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికల్లో తిరిగి వారు గెలుస్తారా లేదా అనేది వేరే విషయం.

ఇకపైన ఎడ్యూరప్పపై వత్తిడి

సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గంలో అవకాశం రాలేదన్న అసంతృప్తితో రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి బీజేపీ పంచన చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులుగా అవకాశం రాకపోతే మరో ముసలం పుట్టడం ఖాయం. మంత్రివర్గంలో చోటు ఉంటుందనే హామీతోనే బీజేపీ దరికి చేరారని కాంగ్రెస్ వర్గాల్లో బలమైన అనుమానమే ఉంది. రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కనీసంగా ఐదుగురు ఆ పార్టీలో సీనియర్ నేతలు మాత్రమే కాక సిద్ధరామయ్యకు బాగా దగ్గరి సన్నిహితులు. ఒకవేళ ఎడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు లభించకపోతే ఏ సమయంలోనైనా వారు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే ఎడ్యూరప్పకు అనేక సవాళ్ళు తప్పవు. మంత్రివర్గంలో ఈ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకపోతే చేజారిపోయే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కల్పిస్తే 105 మందిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలలో చాలా మంది అసంతృప్తికి లోనవుతారు. రెండు వైపుల నుంచీ ఎడ్యూరప్పపై వత్తిడి పెరిగిపోతుంది. ఈ అసంతృప్తులను సకాలంలో చల్లార్చలేకపోతే బీజేపీలో అంతర్గత సంక్షోభానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొన్న సంక్షోభం ఇకపైన బీజేపీలో తలెత్తుతుంది. మళ్ళీ రాజీనామాల డ్రామా మొదలైతే బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. సీన్ రివర్స్ అవుతుంది. ప్రజల స్పష్టమైన మెజారిటీ లేకపోతే ఇలాంటి సంక్షోభాలు కొనసాగుతూనే ఉంటాయనేదానికి కర్నాటక నిలువెత్తు నిదర్శనం.