Home UNIQUE మోడీ vs వైల్డ్

మోడీ vs వైల్డ్

0

ప్రధాని మోడీని మనం రాజకీయ వేదికలపై చూస్తాం… పార్లమెంటులో చూస్తాం… అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశాలు జరుపుతున్నప్పుడు చూస్తాం.. విదేశీ పర్యటనల్లో చూస్తాం.. మన దేశానికి వచ్చిన విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పుడు చూస్తాం.. ఏటా ఒకసారి యోగా దినోత్సవం సందర్భంగా చూస్తాం.. లేదా ఇలాంటి సందర్భాల్లో చూస్తాం. కానీ సినిమా లేదా వీడియో షూటింగ్ లలో చూడడం చాలా అరుదు. కానీ ఇప్పుడు అలాంటి ఒక ఫీచర్ ఫిల్మ్ లో సహజంగా నటించే సన్నివేశాలను త్వరలో చూడబోతున్నాం. హిమాలయ పర్వతాల అంచున ఉండే స్వచ్ఛమైన ఉత్తరాఖండ్ అడవుల్లో సాహస యాత్ర దృశ్యాలను త్వరలో చూడబోతున్నాం. కాలి నడకన అడవుల్లో తిరిగే, నదులను దాటే దృశ్యాలు త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. సెక్యూరిటీ వలయం లేని ప్రధాని మోడీని భిన్నంగా చూడబోతున్నాం.

ఎప్పుడూ రాజకీయాల్లో, పరిపాలనలో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైనా అడవుల్లోకి వెళ్ళారా? ఉధృతంగా ప్రవహించే నదులను దాటే సాహసం చేశారా? మానవ సంచారమే లేని అడవుల్లో తిరిగారా? పచ్చటి ప్రకృతిని హెలికాప్టర్ లో వీక్షించడం కాకుండా స్వయంగా కాలి నడకనే వెళ్ళి చూశారా? వీటికి స్పష్టమైన సమాచారం లేకపోవచ్చుగానీ డిస్కవరీ ఛానెల్ చిత్రీకరిస్తున్న ఒక ఫీచర్ ఫిల్మ్ లో నటించేందుకు మాత్రం కొన్ని రోజుల పాటు ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ అడవుల్లోనే ఉండిపోయారు. వచ్చే నెల 12వ తేదీన డిస్కవరీ ఛానెల్ గ్రూపుకు చెందిన అన్ని ఛానెళ్ళలో 180 దేశాల్లో ప్రసారమయ్యే ఒక ఫీచర్ ఫిల్మ్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీని చూడొచ్చు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్ సభ, రాజ్యసభలకు వస్తారో రారోగానీ ఎప్పుడూ రాజకీయాలు, పాలనకు సంబంధించిన వ్యూహాత్మక చర్చల్లో మాత్రం నిమగ్నమవుతారు. యోగా లాంటి వాటిలో కనిపించే నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రకృతిని పరిరక్షించండి, పర్యావరణాన్ని కాపాడండి అనే సందేశం ఇవ్వడం కోసం ఏకంగా ఉత్తరాఖండ్ లోని దట్టమైన అడవుల్లోకి మాత్రం వెళ్ళారు. మన్ కీ బాత్ కార్యక్రమంతో దేశ ప్రజలకు రేడియో ద్వారా సందేశం ఇచ్చే మోడీ ఇప్పుడు వీడియో ద్వారా వినూత్న సందేశం ఇవ్వబోతున్నారు. మాన్ వర్సెస్ వైల్డ్ అనే శీర్షిక కింద ప్రఖ్యాత సాహస క్రీడల నిపుణులు బేర్ గ్రిల్స్ రూపొందించిన పాపులర్ టీవీ షో లో మాత్రం నరేంద్ర మోడీ కనిపిస్తారు. ప్రధాని మోడీకి రెండో కోణాన్ని ఈ ఫీచర్ ఫిల్మ్ లో గ్రిల్స్ చూపించబోతున్నారు.

ప్రకృతితో నా అనుబంధం కొత్తేమీ కాదు : మోడీ

”నాకు ప్రకృతితో, పచ్చదనంతో సహజీవనం కొత్తమే కాదు. ఎన్నోసార్లు అడవుల్లోకి, పర్వతాల్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ కోసం వెళ్ళాను. అడవితో నాకు కొన్నేండ్ల అనుభవం ఉంది. ఆ సహజీవనమే నా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపింది. ఓ టీవీ ఛానెల్ ప్రతినిధులను నన్ను అడగగానే ఒప్పుకున్నాను. రాజకీయాలకు అతీతంగా ప్రకృతితో నాకు అనుబంధం ఉంది. ఈ ఫిల్మ్ లో నటించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మన దేశానికి సంబంధించిన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యావరణ ప్రాధాన్యతను యావత్తు ప్రపంచానికి తెలియజేయడానికి వీలవుతుంది. రెండోది, ప్రకృతితో భారత మానవ సమాజం ఎంతగా కలిసిపోయి ఉంటుందో తెలియజేస్తూ దాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా పదిలంగా పరిరక్షించుకోవాలన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడం. ఈ ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా అడవిలోనే ఉండిపోవడం ఒక మర్చిపోలేని అనుభూతి. స్వచ్ఛమైన అడవిలో గడిపిన ఆ క్షణాలు చాలా స్వచ్ఛమైనవి” అని మోడీ వ్యాఖ్యానించారు.